Pages

ఆది శంకరుల ఆత్మబోధ

ఆత్మ బోధ



తపోభిః క్షీణపాపానాం శాంతానాం వీతరాగిణాం
ముముక్షూణామపేక్ష్యోఽయమాత్మబోధో విధీయతే  1

తా. తపస్సు చేత తమ పాపములను క్షీణింప జేసుకొన్నటువంటి, శాంత మనస్కులైనటువంటి, రాగద్వేషాది గుణములను త్యజించినట్టి, మోక్షేచ్ఛ గలవారల కొరకై, ఆత్మబోధయన్న యీ ప్రకరణ గ్రంథము రచింప బడుతున్నది.

బోధోఽన్యసాధనేభ్యో హి సాక్షాన్మోక్షైకసాధనం
పాకస్య వహ్నివజ్జ్ఞానం వినా మోక్షో న సిధ్యతి  2

తా. ఇతర సాధనములతో పోల్చి చూడగా, జ్ఞానము మాత్రమే మోక్షమునకు సాధనము. వంట చేయుటకు నిప్పువలె, జ్ఞానము లేకుండ మోక్షము సిద్ధింపనే సిద్ధింపదు.

అవిరోధితయా కర్మ నావిద్యాం వినివర్తయేత్
విద్యావిద్యాం నిహంత్యేవ తేజస్తిమిరసంఘవత్  3

తా. కర్మాచరణము వలన అవిద్య, అజ్ఞానము తొలగదు. కర్మాచరణము అవిద్యకు విరోధము కాదు. కాబట్టి, తేజస్సు - కాంతి చీకటిని పోగొట్టు విధముగా జ్ఞానము అవిద్యను (అజ్ఞానమును) పోగొట్టును.

పరిచ్ఛిన్న ఇవాజ్ఞానాత్తన్నాశే సతి కేవలః
స్వయం ప్రకాశతే హ్యాత్మా మేఘాపాయేంఽశుమానివ   4

తా. అవిద్య వలన ఆత్మ ఉపాధి బద్ధమై పరిచ్ఛిన్నమైనట్లు తోచును. అవిద్య నశింపగా శుద్ధమైన ఆత్మ స్వయం ప్రకాశమై (మేఘము తొలగిన సూర్యుని వలె) వెలుగొందును.

అజ్ఞానకలుషం జీవం జ్ఞానాభ్యాసాద్వినిర్మలం
కృత్వా జ్ఞానం స్వయం నశ్యేజ్జలం కతకరేణువత్  5

తా. అజ్ఞానము వలన కలుషితము చేయబడిన జీవము.... జ్ఞానమును అభ్యసించుట వలన నిర్మలమగను. కతక గంధము నీటిలోని మాలిన్యమును తొలగించి, వాటితో కలిసి అడుగునకు పడిపోయినట్లగును.

సంసారః స్వప్నతుల్యో హి రాగద్వేషాదిసంకులః
స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే సత్యసద్భవేత్  6

తా. రాగద్వేషాదులతో సంకులమైన సంసారము నిజముగా స్వప్నతుల్యమైనది. అది దాని కాలమున సత్యముగా భాసించును. ప్రబోధము కలుగగా అసత్యమై తోచును.

తావత్సత్యం జగద్భాతి శుక్తికారజతం యథా
యావన్న జ్ఞాయతే బ్రహ్మ సర్వాధిష్ఠానమద్వయం  7

తా. ఈ జగత్తు ఎంత కాలము సత్యమే యని భాసంచు ననగా - సర్వాధిష్ఠానమును (అన్నిటియందు అధిష్ఠించి యున్నది) అవ్యయము, అద్వయమును అగు బ్రహ్మమును తెలియని యంత కాలమును, ఆలుచిప్ప ప్రకాశించుచు వెండిగా ఎంతకాలము భ్రమపెట్టును? అది ఆలుచిప్పయని తెలియనంతకాలము. అదే విధముగా బ్రహ్మపదార్థము ఎఱుగనంతకాలము జగత్తు సత్యముగా తోచును.

ఉపాదానేఽఖిలాధారే జగంతి పరమేశ్వరే
సర్గస్థితిలయాన్ యాంతి బుద్బుదానీవ వారిణి  8 

తా. సకల జగదధిష్ఠానమైన పరమేశ్వరుని యందు జగత్తులు పుట్టి, స్థితిని సాగి, లయించును. జలమునందు బుద్బుదములు (నీటి బుడగలు) పుట్టినట్లుగా.

సచ్చిదాత్మన్యనుస్యూతే నిత్యే విష్ణౌ ప్రకల్పితాః
వ్యక్తయో వివిధాః సర్వా హాటకే కటకాదివత్  9

తా. నిత్యమై సర్వవ్యాపియైన బ్రహ్మము నందు, సత్‌ (సర్వకాలములందు ఉనికి) చిత్‌ ఆత్మయు అనునవి అన్నియు అంతర్లీనముగా వ్యక్తమగుచున్నవి. బంగారమున హస్తాభరణములు మొదలగునవి వలె.

యథాకాశో హృషీకేశో నానోపాధిగతో విభుః
తద్భేదాద్భిన్నవద్భాతి తన్నాశే కేవలో భవేత్  10

తా. ఆకాశమువలె భిన్న భిన్న ఉపాధులందున్న పరమాత్మ (హృషీకేశుడు) భిన్న భిన్నముగా ( ఆ భిన్న ఉపాధులు కారణముగ) తోచును. ఆ భిన్న భిన్న ఉపాధులు నశించినపుడు కేవలుడై భాసించును.

నానోపాధివశాదేవ జాతివర్ణాశ్రమాదయః
ఆత్మన్యారోపితాస్తోయే రసవర్ణాది భేదవత్  11

తా. జలము నందు రుచి, రంగు మొదలగునవి ఏర్పడినట్లు, ఆత్మపైన ఉపాధులను బట్టి, జాతి, నామ, ఆశ్రమాదులు ఆరోపితములైనవి.

పంచీకృతమహాభూతసంభవం కర్మసంచితం
శరీరం సుఖదుఃఖానాం భోగాయతనముచ్యతే  12

తా. పంచ మహాభూతముల పంచీకరణము వలన సంభవించిన స్థూలదేహము పూర్వకర్మ సంచితమైయుండి సుఖదుఃఖముల అనుభవస్థానమని చెప్పబడుచున్నది.

పంచప్రాణమనోబుద్ధిదశేంద్రియసమన్వితం
అపంచీకృతభూతోత్థం సూక్ష్మాంగం భోగసాధనం  13

తా. సూక్ష్మ శరీరము పంచ ప్రాణ, మనోబుద్ధి దశేంద్రియ సమన్వితమై అపంచీకృత భూతముల నుండి ప్రభవించినవి. ఇది భోగములను అనుభవించుటకు సాధనము.

అనాద్యవిద్యానిర్వాచ్యా కారణోపాధిరుచ్యతే
ఉపాధిత్రితయాదన్యమాత్మానమవధారయేత్  14

తా. అనాదియైనట్టిదియు, అనిర్వాచ్యమైనట్టిదియు నగు అవిద్య కారణ శరీరమని చెప్పబడుచున్నది. ఈ ఉపాధి త్రయము కంటె ఆత్మ భిన్నమని తెలియవలెను.

పంచకోశాదియోగేన తత్తన్మయ ఇవ స్థితః
శుద్ధాత్మా నీలవస్త్రాదియోగేన స్ఫటికో యథా  15

తా. ఆత్మ పంచకోశముల సంబంధము వలన ఆ యా కోశముల మయమై యున్నట్లుగా నుండును. నీల వస్త్రము మొదలైన వాటి సంబంధము వలన శుద్ధమైన స్ఫటికము నీలపు రంగు మొదలగు రంగు కలిగియున్నట్లుగా నుండినటుల.

వపుస్తుషాదిభిః కోశైర్యుక్తం యుక్త్యవఘాతతః
ఆత్మానమంతరం శుద్ధం వివించ్యాత్తండులం యథా  16

తా. పంచకోశములు, స్థూలశరీరము అన్న పెచ్చు (ఊక)తో నున్న ఆత్మను ఆత్మవిచారణయన్న దంపుడు వలన - పరిశుద్ధమైన అంతర సత్యమైన ఆత్మను తెలియవలెను. వరిగింజ నుండి బియ్యపు గింజ దంపుడు వలన ఊకను తొలగించినపుడే బయటపడుచున్నది కదా!

సదా సర్వగతోఽప్యాత్మా సర్వత్రావభాసతే
బుద్ధావేవావభాసేత స్వచ్ఛేషు ప్రతిబింబవత్  17

తా. ఆత్మ సర్వమునందుండినప్పటికి, అన్నిటియందది భాసించదు. స్వచ్ఛములైన దర్పణాదులందే ప్రతిబింబములు కన్పించునట్లు, ఆత్మ బుద్ధియందు మాత్రమే అవభాసించును.

దేహేంద్రియమనోబుద్ధిప్రకృతిభ్యో విలక్షణం
తద్వృత్తిసాక్షిణం విద్యాదాత్మానం రాజవత్సదా  18

తా. దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ప్రకృతి గుణములు మొదలైన వాటికంటే విలక్షణమై - యీ అన్నిటి వృత్తులకు సాక్షియైన ఆత్మను (మంత్రులు మొదలగువారి చర్యలకు సాక్షియైన రాజువలె) తెలియునది.

వ్యాపృతేష్వింద్రియేష్వాత్మా వ్యాపారీవావివేకినాం
దృశ్యతేఽభ్రేషు ధావత్సు ధావన్నివ యథా శశీ  19

తా. అవివేకులైన వారికి, ఇంద్రియములు తమ తమ వ్యాపారములు చేయుచుండగా - ఆత్మయే ఆ వ్యాపారములు చేయుచున్నట్లు తోచును. చుట్టుకొనియున్న మేఘములు కదలుచుండగా చందమామ కదులునట్లే తోచు విధముగా.

ఆత్మచైతన్యమాశ్రిత్య దేహేంద్రియమనోధియః
స్వక్రియార్థేషు వర్తంతే సూర్యాలోకం యథా జనాః 20

తా. చైతన్యమైన ఆత్మను ఆశ్రయించి, దేహము జ్ఞానేంద్రియ పంచకము మనస్సు బుద్ధి తమ తమ అర్థములందు (విషయ వ్యాపారము లందు) వర్తించుచున్నవి. జనులు సూర్యుని ప్రకాశముపై ఆధారపడి తమ తమ వ్యాపారములను చేసుకొనుచున్న విధముగా.

దేహేంద్రియగుణాన్కర్మాణ్యమలే సచ్చిదాత్మని
అధ్యస్యంత్యవివేకేన గగనే నీలతాదివత్  21

తా. అవివేకులు దేహ ఇంద్రియ గుణములను, కర్మములను సచ్చిత్తు అయిన ఆత్మపై అధ్యారోపించుకొనుచున్నారు; ఆకాశమున నీలపు రంగును ఆపాదించుకొనుచున్న విధముగా.

అజ్ఞానాన్మానసోపాధేః కర్తృత్వాదీని చాత్మని
కల్ప్యంతేఽమ్బుగతే చంద్రే చలనాది యథాంభసః 22

తా. అజ్ఞానము కారణము వలన మనస్సు యొక్క కర్తృత్వాదులన్నియు ఆత్మయందు కల్పించుకొనుచున్నారు. నీటి యందు ప్రతిఫలించిన చంద్రబింబము పైన నీటి యొక్క ప్రవాహాదులను కల్పించుకొన్న విధముగా.

రాగేచ్ఛాసుఖదుఃఖాది బుద్ధౌ సత్యాం ప్రవర్తతే
సుషుప్తౌ నాస్తి తన్నాశే తస్మాద్బుద్ధేస్తు నాత్మనః  23

తా. రాగ, ఇచ్ఛ, సుఖ దుఃఖాదులు బుద్ధి ఉన్నపుడే ప్రవర్తించునవి. నిద్రయందు బుద్ధి లయము పొంది ఉండు సమయమునందవి లేవు. కాబట్టి, అవి బుద్ధికి సంబంధించినవే కాని, ఆత్మకు సంబంధించినవి కానేకావు.

ప్రకాశోఽర్కస్య తోయస్య శైత్యమగ్నేర్యథోష్ణతా
స్వభావః సచ్చిదానందనిత్యనిర్మలతాత్మనః  24

తా. సూర్యునికి ప్రకాశించుట స్వభావమైనట్లు, జలమునకు చల్లగా నుండుట స్వభావమైనట్లు, అగ్నికి వేడి స్వభావమైనట్లు ఆత్మకు సత్‌, చిత్‌, ఆనందములు నిత్యత్వము నిర్మలత్వములు స్వభావములు.

ఆత్మనః సచ్చిదంశశ్చ బుద్ధేర్వృత్తిరితి ద్వయం
సంయోజ్య చావివేకేన జానామీతి ప్రవర్తతే  25

తా. ఆత్మ యొక్క సత్‌, చిదంశము, బుద్ధి యొక్క వృత్తి - ఈ రెండును అవివేకము వలన కలిపికొనుట వలన "నేను తెలిసికొంటిని" అన్న దేర్పడుచున్నది.

ఆత్మనో విక్రియా నాస్తి బుద్ధేర్బోధో న జాత్వితి
జీవః సర్వమలం జ్ఞాత్వా జ్ఞాతా ద్రష్టేతి ముహ్యతి  26

తా. ఆత్మకు పరిణామము - మార్పు లేదు. బుద్ధికి జ్ఞానమన్నది లేనే లేదు. వైయుక్తిక ఆత్మ - జీవుడు - అన్నియు తెలిసి (తప్పుగా) మిక్కిలి భ్రమకు లోనై "నేను కర్తను, నేను ద్రష్టను" అని తలచుచున్నాడు.

రజ్జుసర్పవదాత్మానం జీవం జ్ఞాత్వా భయం  వహేత్
నాహం జీవః పరాత్మేతి జ్ఞాతం చేన్నిర్భయో భవేత్  27

తా. త్రాడును సర్పముగా భ్రాంతి పొందినట్లు, ఆత్మను జీవునిగా తలంచుట వలన భయము పొందుట జరుగుచున్నది. ఆత్మ జీవుడు కాదని, పరమాత్మయని తెలియగా నిర్భయమగుచున్నది.

ఆత్మావభాసయత్యేకో బుద్ధ్యాదీనీంద్రియాణ్యపి
దీపో ఘటాదివత్స్వాత్మా జడైస్తైర్నావభాస్యతే  28

తా. ఆత్మయే బుద్ధిని, జ్ఞానేంద్రియములను ప్రకాశింపజేయుచున్నది. దీపము ఘటాదులను ప్రకాశింపజేయునట్లు. ఆత్మ ఆ జడ వస్తువుల చేత ప్రకాశింపజేయబడదు.

స్వబోధే నాన్యబోధేచ్ఛా బోధరూపతయాత్మనః
న దీపస్యాన్యదీపేచ్ఛా యథా స్వాత్మప్రకాశనే  29

తా. స్వాత్మ జ్ఞానమునకై మరియొక జ్ఞానావసరము లేదు. ఆత్మ జ్ఞానమే కాబట్టి. దీపము ప్రకాశించుటకు మరియొక దీపాపేక్ష లేనే లేదు.

నిషిధ్య నిఖిలోపాధీన్నేతి నేతీతి వాక్యతః
విద్యాదైక్యం మహావాక్యైర్జీవాత్మపరమాత్మనోః  30

తా. ఇది కాదు, ఇది కాదు - అని ఉపాధులన్నిటిని పరిత్యజించి - మహావాక్యోపదిష్టముగా జీవాత్మ పరమాత్మల ఐక్యతను అనుసంధించుకొనవలెను.

ఆవిద్యకం శరీరాది దృశ్యం బుద్బుదవత్క్షరం
ఏతద్విలక్షణం విద్యాదహం బ్రహ్మేతి నిర్మలం  31

తా. అవిద్యా (అజ్ఞాన) జన్యములైన వస్తువులు - దేహాదులు - నీటి బుడగవలె నశ్వరములు. ఇంతకు విలక్షణముగా నేను పరిశుద్ధమగు బ్రహ్మమునే అని తెలియవలెను.

దేహాన్యత్వాన్న మే జన్మజరాకార్శ్యలయాదయః
శబ్దాదివిషయైః సంగో నిరింద్రియతయా న చ  32

తా. నేను దేహము కంటే భిన్నుడును కాబట్టి జన్మము, జర, పరిణామము, మరణము నాకు చెందవు. నాకు ఇంద్రియములు లేవు గనుక ఇంద్రియ విషయములైన శబ్దాదులతో నాకు సంబంధము లేదు.

అమనస్త్వాన్న మే దుఃఖరాగద్వేషభయాదయః
అప్రాణో హ్యమనాః శుభ్ర ఇత్యాది శ్రుతిశాసనాత్  33

తా. నేను మనస్సున్నవాడను కాదు కనుక, దుఃఖము, రాగము, భయము, ద్వేషము మొదలగునవి నాకు కావు. శ్రుతి శాసించుచునే యున్నది. ఆత్మకు ప్రాణము అనుబంధము లేదని, మనస్సు లేదని, పరిశుద్ధమైనదని. మొదలుగా -


నిర్గుణో నిష్క్రియో నిత్యో నిర్వికల్పో నిరంజనః
నిర్వికారో నిరాకారో నిత్యముక్తోఽస్మి నిర్మలః  34

తా. గుణరహితమై, క్రియారహితమై, నిత్యమై, వికల్ప శూన్యమై, నిరంజనమై వికారములు (పరిణామములు) లేక, ఆకార వర్జితమై, ఆత్మనగు నేను నిత్యముక్తుడను, నిర్మలుడను.

అహమాకాశవత్సర్వం బహిరంతర్గతోఽచ్యుతః
సదా సర్వసమః సిద్ధో నిఃసంగో నిర్మలోఽచలః  35

తా. ఆకాశము వలె నేను బహిరంతరముల సర్వమున వ్యాపించి యున్నాను. నేను అచ్యుతుడను. ఎల్లప్పుడు నేను ఎల్లెడల సమసిద్ధుడను. నిస్సంగుడను. నిర్మలుడను. అచలుడను.

నిత్యశుద్ధవిముక్తైకమఖండానందమద్వయం
సత్యం జ్ఞానమనంతం యత్పరం బ్రహ్మాహమేవ తత్  36

తా. నిత్యమై, శుద్ధమై, బుద్ధ ముక్తమై, అఖండానందమై, అద్వయమై, సత్యమై, జ్ఞానమై, అనంతమై వెలయు పరమగు బ్రహ్మమునే - నేను.

ఏవం నిరంతరాభ్యస్తా బ్రహ్మైవాస్మీతి వాసనా
హరత్యవిద్యావిక్షేపాన్ రోగానివ రసాయనం  37

తా. "అహం బ్రహ్మాస్మి" అన్న భావన నిరంతరము చేయుట వలన అవిద్యా విక్షేపములను హరించును. ఔషధము రోగములను నిర్మూలించినట్లు.

వివిక్తదేశ ఆసీనో విరాగో విజితేంద్రియః
భావయేదేకమాత్మానం తమనంతమనన్యధీః  38

తా. విజన ప్రదేశమున కూర్చుండి విరాగియై, ఇంద్రియములను నిగ్రహించి, ఏకమై అనంతమైన ఆత్మను గురించి ఏకాగ్రమైన మనసుతో ధ్యానింపవలెను.

ఆత్మన్యేవాఖిలం దృశ్యం ప్రవిలాప్య ధియా సుధీః
భావయేదేకమాత్మానం నిర్మలాకాశవత్సదా  39

తా. బుద్ధి వృత్తి చేత దృశ్య ప్రపంచము నంతటిని ఆత్మయందు విలీనము కావించి వివేకి - నిర్మాలకాశము వలె శుద్ధమైన ఆత్మ నొక్కదానినే భావింపవలెను. ధ్యానింపవలెను.

రూపవర్ణాదికం సర్వం విహాయ పరమార్థవిత్
పరిపూర్ణచిదానందస్వరూపేణావతిష్ఠతే  40

తా. రూపము, వర్ణము మొదలగునట్టివన్నిటిని వదిలి, పరమార్థమును తెలిసినవాడు పరిపూర్ణ చిదానంద స్వరూపముతో నుండును.

జ్ఞాతృజ్ఞానజ్ఞేయభేదః పరే నాత్మని విద్యతే
చిదానందైకరూపత్వాద్దీప్యతే స్వయమేవ హి 41

తా. జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము అను భేదములు పరాత్మ యందు లేవు. అది చిదానందైక రూపమగుటచేత స్వయముగానది ప్రకాశించును.

ఏవమాత్మారణౌ ధ్యానమథనే సతతం కృతే
ఉదితావగతిర్జ్వాలా సర్వాజ్ఞానేంధనం దహేత్  42

తా. అట్లు ఆత్మయన్న అరణి (బుద్ధి యందు) ధ్యానమును సతతము జరిపినపుడు, జ్ఞానమన్న అగ్ని జ్యోతి రగిలి అజ్ఞానమను కట్టెలను దహించును.

అరుణేనేవ బోధేన పూర్వం సంతమసే హృతే
తత ఆవిర్భవేదాత్మా స్వయమేవాంశుమానివ  43

తా. ఆవరించియున్న చీకటి (అజ్ఞానము) జ్ఞానము వలన తొలగింపబడగా (సూర్యుని రథ సారథియైన ఆరుణి వలన చీకటి తొలగింపబడినట్లు) అప్పుడు సూర్యుడుదయించినట్లు ఆత్మ ప్రకాశమగును.

ఆత్మా తు సతతం ప్రాప్తోఽప్యప్రాప్తవదవిద్యయా
తన్నాశే ప్రాప్తవద్భాతి స్వకంఠాభరణం యథా  44

తా. ఆత్మ యెల్లప్పుడు ప్రాప్తమై యున్నది. అవిద్య వలన అప్రాప్తముగా తోచును. అవిద్య నశించగా, అపుడు ప్రాప్తమైనట్లు వెల్లడి యగును - స్వకంఠాభరణమువలె.

స్థాణౌ పురుషవద్భ్రాంత్యా కృతా బ్రహ్మణి జీవతా
జీవస్య తాత్త్వికే రూపే తస్మిందృష్టే నివర్తతే  45

తా. బ్రహ్మము నందు జీవుడుగా తలంచుట భ్రాంతి వలన స్థాణువైన స్తంభమును చీకటిలో మనుష్యుడని భావించినట్లు. బ్రహ్మము నందు జీవుని తాత్త్విక రూపము తెలిసినపుడు, జీవుని భిన్న భావము తొలగిపోవును.

తత్వస్వరూపానుభవాదుత్పన్నం జ్ఞానమంజసా
అహం మమేతి చాజ్ఞానం బాధతే దిగ్భ్రమాదివత్  46

తా. తత్త్వ స్వరూపమును అనుభవమునకు తెచ్చుకొనుట వలన కలిగిన జ్ఞానము వలన 'నేను' (అహం) నాది వంటి భావములను తొలగించును. సూర్యోదయమువలన దిక్కులు తెలియకపోయిన భ్రాంతి తొలగిపోయినట్లే.

సమ్యగ్విజ్ఞానవాన్ యోగీ స్వాత్మన్యేవాఖిలం జగత్
ఏకం చ సర్వమాత్మానమీక్షతే జ్ఞానచక్షుషా  47

తా. సమ్యగ్విజ్ఞానము కలిగిన యోగి తన యందే అఖిలమును అద్వితీయమైన ఆత్మయే సర్వముగను జ్ఞాన నేత్రము వలన చూచును.

ఆత్మైవేదం జగత్సర్వమాత్మనోఽన్యన్న విద్యతే
మృదో యద్వద్ఘటాదీని స్వాత్మానం సర్వమీక్షతే  48

తా. జగత్తు సర్వమును ఆత్మయే. ఆత్మకంటే అన్యమైనది వేరేదియు లేదు. ఆత్మ దేది సర్వమును ఆత్మగా చూచుచు - ఘటము మొదలగు వానినెల్ల మట్టిగా చూచిన విధముననే.

జీవన్ముక్తస్తు తద్విద్వాన్పూర్వోపాధిగుణాన్స్త్యజేత్
సచ్చిదానందరూపత్వాత్ భవేద్భ్రమరకీటవత్  49

తా. కీటకము భ్రమరమైనట్లుగా జీవన్ముక్తి (బ్రతికి యుండగనే ముక్తి) లభించున దెప్పుడనగా పూర్వ ఉపాధుల సంబంధమైన సకల వాసనాది గుణములను త్యజించి సత్‌, చిత్‌ మొదలగు ధర్మత్వమును అనుసరించగా.

తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్
యోగీ శాంతిసమాయుక్త ఆత్మారామో విరాజతే  50

తా. మోహమను సముద్రమును దాటి, రాగము ద్వేషము అను అడ్డు వచ్చు రాక్షసులను నిర్మూలించి, యోగి శాంతి యుక్తుడై ఆత్మారాముడై విరాజిల్లును.

బాహ్యానిత్యసుఖాసక్తిం హిత్వాత్మసుఖనిర్వృతః
ఘటస్థదీపవత్స్వస్థం స్వాంతరేవ ప్రకాశతే  51

తా. అనిత్యములైన బాహ్య సుఖములందు ఆసక్తిని చంపుకొని ఆత్మ సుఖ నిర్వృతుడై (అతడు) ఘటమునందున్న దీపమువలె లోన ప్రకాశించును.

ఉపాధిస్థోఽపి తద్ధర్మైరలిప్తో వ్యోమవన్మునిః
సర్వవిన్మూఢవత్తిష్ఠేదసక్తో వాయువచ్చరేత్  52

తా. పరిమితులున్న ఉపాధిగతుడైనప్పటికి, దాని యొక్క గుణ ధర్మశీలము లతనికి పట్టవు. ఆకాశమువలె; సర్వము తెలిసినవాడయ్యు మూఢునివలె నుండును. వాయువువలె అనాసక్తుడై చరించును.

ఉపాధివిలయాద్విష్ణౌ నిర్విశేషం విశేన్మునిః
జలే జలం వియద్వ్యోమ్ని తేజస్తేజసి వా యథా  53

ఉపాధి లయము పొందినపుడు యోగి నిర్విశేషమైన సర్వవ్యాప్తమైన దానిని చేరును. జలము జలమును, ఆకాశము ఆకాశమును తేజస్సును తేజస్సు కలిసినట్లు.

యల్లాభాన్నాపరో లాభో యత్సుఖాన్నాపరం సుఖం
యత్‌ జ్ఞానాన్నాపరం జ్ఞానం తద్బ్రహ్మేత్యవధారయేత్  54

తా. దేనిని పొందిన లాభము కంటె అధికమగు లాభమేదియు లేదో, దేని సుఖము కంటె అధికమగు సుఖము లేనిదేదో, దేని జ్ఞానము కంటె అధికమైన జ్ఞానము లేదో, దానిని బ్రహ్మమని తెలియుము.

యద్దృష్ట్వా నాపరం దృశ్యం యద్భూత్వా న పునర్భవః
యజ్జ్ఞాత్వా నాపరం జ్ఞేయం తద్బ్రహ్మేత్యవధారయేత్  55

తా. దేనిని చూచిన మఱి చూడవలసినది లేదో, ఏది అయిన మఱి కావలసిన దిక లేదో, దేనిని తెలిసికొన్న మరల తెలిసికోవలసినది లేదో - అది బ్రహ్మమని తెలియము.

తిర్యగూర్ధ్వమధః పూర్ణం సచ్చిదానందమద్వయం
అనంతం నిత్యమేకం యత్తద్బ్రహ్మేత్యవధారయేత్  56

తా. ఏది తిర్యగూర్థ్వము లందు అధోమార్గమున సంపూర్ణమైనదో - ఏది అద్వయమై సత్తు చిత్తు ఆనందమైనదో, ఏది అనంతమై, నిత్యమై, అఖండమై, ఏకమైనదో అది బ్రహ్మమని తెలియుము.

అతద్వ్యావృత్తిరూపేణ వేదాంతైర్లక్ష్యతేఽద్వయం
అఖండానందమేకం యత్తతద్బ్రహ్మేత్యవధారయేత్  57

తా. ఉపనిషత్తులు దేనిని నిరూపించుటకు ఇది కాదని, ఇది కాదని అతద్వ్యావృత్తి రూపమున తెలుపుచున్నవో, ఏది అఖండము, ఏకము అగు ఆనందమో దానిని బ్రహ్మమని తెలియుము.

అఖండానందరూపస్య తస్యానందలవాశ్రితాః
బ్రహ్మాద్యాస్తారతమ్యేన భవంత్యానందినోఽఖిలాః  58

తా. బ్రహ్మము నందొక కణమును ఆశ్రయించిన వారై (ఆ బ్రహ్మము అఖండ ఆనంద రూపము) సృష్టి కర్త యగు బ్రహ్మ మొదలగు నందరు తారతమ్యముగ ఆనందినులగుచున్నారు.

తద్యుక్తమఖిలం వస్తు వ్యవహారస్తదన్వితః
తస్మాత్సర్వగతం బ్రహ్మ క్షీరే సర్పిరివాఖిలే  59

తా. సకల వస్తువులను దాని (బ్రహ్మము) తో నిండియున్నవి. వ్యవహారమంతయు చిత్తుతో సమన్వితమై యున్నది. పాలయందు వెన్నవలె.

అనణ్వస్థూలమహ్రస్వమదీర్ఘమజమవ్యయం
అరూపగుణవర్ణాఖ్యం తద్బ్రహ్మేత్యవధారయేత్  60

తా. ఏది స్థూలము కాదో, ఏదో సూక్ష్మము కాదో, ఏది హ్రస్వము గాని దీర్ఘము గాని కాదో, ఏది జన్మింప లేదో, ఏది అవ్యయమో, ఏది రూప నామ గుణ వర్ణములు లేనిదో... దానిని బ్రహ్మమని తెలియము.

యద్భాసా భాస్యతేఽర్కాది భాస్యైర్యత్తు భాస్యతే
యేన సర్వమిదం భాతి తద్బ్రహ్మేత్యవధారయేత్  61

తా. దేని ప్రకాశము వలన సూర్యాదులు వెలుగునో, ఏది ఇతరములైన వస్తువుల చేత ప్రకాశింపదో, ఏది యీ సర్వమైననో, దానిని బ్రహ్మముగా తెలియుము.

స్వయమంతర్బహిర్వ్యాప్య భాసయన్నఖిలం జగత్
బ్రహ్మ ప్రకాశతే వహ్నిప్రతప్తాయసపిండవత్  62

తా. అంతర బహిర్వ్యాప్తి కలిగి జగత్తు నంతయు ప్రకాశింప జేయుచు బ్రహ్మము ప్రకాశించుచున్నది. ఇనుప గుండును ఎఱ్ఱని ముద్దగా చేయు అగ్నివలె.

జగద్విలక్షణం బ్రహ్మ బ్రహ్మణోఽన్యన్న కించన
బ్రహ్మాన్యద్భాతి చేన్మిథ్యా యథా మరుమరీచికా  63

తా. జగత్తు కంటె బ్రహ్మము విలక్షణమైనది. అయితే బ్రహ్మము కంటె అన్యమైన దేమియు లేదు. బ్రహ్మము కంటె అన్యమైన దేదిగాని వెలుగుచున్నచో - అది ఎడారిలో ఎండమావుల వలె భ్రాంతి కల్పితమే.

దృశ్యతే శ్రూయతే యద్యద్బ్రహ్మణోఽన్యన్న తద్భవేత్
తత్త్వజ్ఞానాచ్చ తద్బ్రహ్మ సచ్చిదానందమద్వయం  64

తా. దృశ్య మగునది (శ్రవ్యమగునది) బ్రహ్మము కంటె వేరు కాదు. తత్త్వజ్ఞానము వలన బ్రహ్మము అద్వయమైన సచ్చిదానందమని సిద్ధించును.

సర్వగం సచ్చిదాత్మానం జ్ఞానచక్షుర్నిరీక్షతే
అజ్ఞానచక్షుర్నేక్షేత భాస్వంతం భానుమంధవత్  65

తా. జ్ఞాన నేత్రము కలవానికి సర్వాత్మకమైన సచ్చిదానందమైన ఆత్మ తెలియును. అజ్ఞాన నేత్రము కలవానికి కనిపించదు. గ్రుడ్డివానికి సూర్యుడు కన్పించనట్లు.

శ్రవణాదిభిరుద్దీప్తజ్ఞానాగ్నిపరితాపితః
జీవః సర్వమలాన్ముక్తః స్వర్ణవద్ద్యోతతే స్వయం  66

తా. శ్రవణాదుల వలన ప్రజ్వలింపబడిన జ్ఞానాగ్నిలో తపించి జీవి సర్వ మలముల నుండి విముక్తి పొంది బంగారు వలె స్వయముగా వెలుగును.

హృదాకాశోదితో హ్యాత్మా బోధభానుస్తమోఽపహృత్
సర్వవ్యాపీ సర్వధారీ భాతి భాసయతేఽఖిలం  67

తా. హృదయాకాశమున జ్ఞాన సూర్యుడన్న ఆత్మ ఉదయించి అవిద్యయన్న చీకటిని నశింపజేయును. సర్వవ్యాపియై, సర్వాధారియై అన్నిటిని వెలిగించి తాను వెలుగును.

దిగ్దేశకాలాద్యనపేక్ష్య సర్వగం
శీతాదిహృన్నిత్యసుఖం నిరంజనం
యః స్వాత్మతీర్థం భజతే వినిష్క్రియః
స సర్వవిత్సర్వగతోఽమృతో భవేత్  68

తా. అన్ని క్రియలను త్యజించి, దేశకాల దిక్కుల అపేక్ష లేకుండ ఆత్మ తీర్థమును భజించువాడు (అది సర్వగతము, శీతాదులను హరించునది, నిత్యసుఖమైనది, నిర్మలమైనది) సర్వగుడై సర్వవేత్తయై అమృతుడగను.

 ఇతి శంకరాచార్యవిరచిత ఆత్మబోధః సమాప్తః
శంకరాచార్యుల విరచితమైన ఆత్మ బోధ ప్రకరణ గ్రంథము సమాప్తము.